Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 19, 2013

యెహెజ్కేలు1వఅధ్యాయము

1  ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవ దినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవ బడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను. 
2  యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును 
3  యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను. 
4  నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చు చుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతిదానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటి దొకటి కనబడెను. 
5  దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది. 
6  ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్క లును గలవు. 
7  వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను. 
8  వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలు గింటికిని ముఖములును రెక్కలును ఉండెను. 
9  వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను. 
10  ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖ ములు కలవు. 
11  వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను. 
12  అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మ యే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవు చుండెను. 
13  ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పుల తోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను. 
14  మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగు చుండెను. 
15  ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి యెదుట ముఖముల ప్రక్కను చక్రమువంటిదొకటి కనబడెను. 
16  ఆ చక్రములయొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను, ఆ నాలుగును ఒక్క విధముగానే యుండెను. వాటి రూప మును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. 
17  అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరుగకయే జరుగుచుండెను. 
18  వాటి కైవారములు మిక్కిలి యెత్తుగలవై భయంకరముగా ఉండెను, ఆ నాలుగు కైవారములు చుట్టు కండ్లతో నిండి యుండెను. 
19  ఆ జీవులు కదలగా ఆ చక్రములును వాటి ప్రక్కను జరిగెను, అవి నేలనుండి లేచినప్పుడు చక్రములుకూడ లేచెను. 
20  ఆత్మ యెక్కడికి పోవునో అక్క డికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను. 
21  జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను, అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి నేలనుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను. 
22  మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటిక ముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి యుండెను. 
23  ఆ మండలమువంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొకదానిప్రక్క ఒకటి పైకి చాప బడియుండెను; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును, అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను. 
24  అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని; అది విస్తార మైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వనివలెను ఉండెను, అవి నిలుచునప్పుడెల్ల తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. 
25  అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలమువంటి దానిలోనుండి శబ్దము పుట్టెను. 
26  వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపి యగు ఒకడు ఆసీనుడైయుండెను. 
27  చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కన బడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కన బడెను, చుట్టును తేజోమయముగా కనబడెను. 
28  వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. 

యెహెజ్కేలు2వఅధ్యాయము

1  నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను అని 
2  ఆయన నాతో మాటలాడి నప్పుడు ఆత్మ నాలోనికివచ్చి నన్ను నిలువబెట్టెను; అప్పుడు నాతో మాటలాడినవాని స్వరము వింటిని. 
3  ఆయన నాతో ఇట్లనెనునరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనులయొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను; వారును వారి పితరులును నేటివరకును నామీద తిరుగుబాటు చేసినవారు. 
4  వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయు 
5  వారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లుప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. 
6  నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు; 
7  అయినను ఆ జనులకు భయ పడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగు బాటు చేయువారు వారికి భయపడకుము. 
8  వారు తిరుగు బాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. 
9  నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరుతెరచి నేనిచ్చుదాని భుజించుము అనెను. 
10  నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన యొక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నాముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై యుండెను; మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడియుండెను. 

యెహెజ్కేలు3వఅధ్యాయము

1  మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, నీకు కనబడినదానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. 
2  నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి 
3  నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను. 
4  మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. 
5  నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు జనులయొద్దకు కాదు ఇశ్రాయేలీయులయొద్దకే నిన్ను పంపుచున్నాను. 
6  నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనులయొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపిన యెడల వారు నీ మాటలు విందురు. 
7  అయితే ఇశ్రాయేలీయులందరు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై, నేను చెప్పిన మాటల నాలకింపనొల్లక యున్నారు గనుక నీ మాటలు విననొల్లరు. 
8  ఇదిగో వారి ముఖమువలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను. 
9  నీ నుదురు చెకుముకి రాతికంటె కఠినముగా ఉండు వజ్రమువలె చేసెదను; వారికి భయపడకుము, వారందరు తిరుగు బాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. 
10  మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పుమాటలన్నిటిని చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని 
11  బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి యీ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. 
12  అంతలో ఆత్మ నన్నెత్తికొనిపోగాయెహోవా ప్రభా వమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన యున్న స్థలమునుండి ఆర్భాటముతో నా వెనుక పలు కుట నేను వింటిని. 
13  మరియు ఆ జంతువుల రెక్కలు ఒక దానికొకటి తగులుటవలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగు చున్నట్లుగా నాకు వినబడెను 
14  ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. 
15  నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడినవారి యొద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి యేమియు చెప్పకయు కదలకయు నున్నవాడనై యేడు దినములు వారి మధ్య నుంటిని. 
16  ఆ యేడు దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 
17  నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము. 
18  అవశ్యముగా నీవు మరణ మవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. 
19  అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతనుండి దుష్‌క్రియలనుండియు మరలనియెడల అతడు తన దోషమునుబట్టి మరణమవును గాని నీవు (ఆత్మను) తప్పించుకొందువు. 
20  మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని యెడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండ అతడు తన దోషమునుబట్టి మరణ మవును, అయితే అతని ప్రాణవిషయములో నిన్ను ఉత్తర వాదిగా ఎంచుదును. 
21  అయితేపాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరికచేయగా అతడు హెచ్చ రింపబడి పాపముచేయక మానినయెడల అతడు అవశ్య ముగా బ్రదుకును, నీ మట్టుకు నీవును (ఆత్మను) తప్పించు కొందువు. 
22  అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. 
23  నేను లేచి మైదానపు భూమికి వెళ్లగా, కెబారునది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్ష మాయెను. 
24  నేను నేలను సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువ బెట్టిన తరువాత యెహోవా నాతో మాటలాడి ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, వారు నీ మీద పాశములువేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్లక యింటికిపోయి దాగియుండుము. 
25  వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక యుండునట్లు 
26  నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన జేసెదను. 
27  అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను, వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారియొద్దకు పోయివినువాడు వినునుగాక విననొల్లనివాడు విననొల్లకయుండును గాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. 

యెహెజ్కేలు4వఅధ్యాయము

1  నరపుత్రుడా, పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేముపట్టణపు రూపమును దాని మీద వ్రాయుము. 
2  మరియు అది ముట్టడి వేయబడి నట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసి నట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము. 
3  మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. 
4  మరియు నీ యెడమప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను; ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దిన ములు నీవు వారి దోషమును భరింతువు. 
5  ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడువందల తొంబది దినములు నిర్ణయించియున్నాను. 
6  ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలు వది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణ యించి యున్నాను. 
7  ఈలాగు నీవుండగా యెరూష లేము ముట్టడివేయబడినట్లు తేరిచూచుచు, చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానినిగూర్చి ప్రకటింపవలెను. 
8  పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్నుకట్లతో బంధింతును. 
9  మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్కమీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను; 
10  నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళవేళకు తినవలెను, 
11  నీళ్లు కొలప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగ వలెను, వేళవేళకు త్రాగవలెను; 
12  యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను; 
13  నేను వారిని తోలివేయు జనము లలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. 
14  అందుకు అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటి వరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా 
15  ఆయనచూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి యున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధ పరుచుకొనుమని సెలవిచ్చి 
16  నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు. 
17  అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు. 

యెహెజ్కేలు5వఅధ్యాయము

1  మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగల కత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరముచేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము. 
2  పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును. 
3  అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము; 
4  పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోవేసి కాల్చుము; దానినుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని తగులబెట్టును. 
5  మరియు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఇది యెరూషలేమే గదా, అన్యజనులమధ్య నేను దాని నుంచితిని, దానిచుట్టు రాజ్యములున్నవి. 
6  అయితే వారు నా విధులను తృణీకరించి, నా కట్టడల ననుసరింపక దుర్మార్గత ననుసరించుచు, నా విధులను కట్టడలను త్రోసి వేసి తమ చుట్టునున్న అన్యజనుల కంటెను దేశస్థులకంటెను మరి యధికముగా దుర్మార్గులైరి 
7  కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునా కట్టడల ననుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టునున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టునున్న దేశస్థులకంటె మరి యధికముగా కఠినహృదయులైతిరి. 
8  కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. 
9  నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయనికార్యమును, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును. 
10  కావున నీ మధ్య తండ్రులు తమ కుమారు లను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును. 
11  నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు 
12  కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును. 
13  నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు 
14  ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. 
15  కావున నీ పోషణాధారము తీసివేసి, నీమీదికి నేను మహా క్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దిం పులచేతను నేను నిన్ను శిక్షింపగా 
16  నీ చుట్టునున్న అన్య జనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయ మునకును ఆస్పదముగా ఉందువు; యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను. 
17  ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్రహీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. 

యెహెజ్కేలు6వఅధ్యాయము

1  యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 
2  నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వత ములతట్టు చూచి వాటివిషయమై యీ మాటలు ప్రక టించుము 
3  ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభు వైన యెహోవా మాట ఆలకించుడి; పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థల ములను నాశనము చేసెదను. 
4  మీ బలిపీఠములు పాడై పోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్న ములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను. 
5  ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి, మీ యెముకలను మీ బలి పీఠములచుట్టు పారవేయుదును. 
6  నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు ఛిన్నా భిన్న ములగును, సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడ గొట్ట బడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడువబడును, 
7  మీ జనులు హతులై కూలుదురు. 
8  అయినను మీరు ఆ యా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనులమధ్య ఉండనిచ్చెదను. 
9  మరియు నన్ను విసర్జించినవారి విశ్వాస ఘాతక మైన వ్యభిచారమనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచారదృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయకృత్యము లన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు 
10  నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు; ఈ కీడు వారికి చేసెదనని నేను చెప్పినమాట వ్యర్థము కాదు. 
11  ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగానీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలు దురు. 
12  దూరముననున్న వారు తెగులుచేత చత్తురు, దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు, శేషించి ముట్టడి వేయబడినవారు క్షామముచేత చత్తురు; ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును. 
13  తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠములచుట్టును ఎత్తయిన కొండలన్నిటిమీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటిక్రిందను, తమ విగ్రహములన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులైయుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. 
14  నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటె మరి నిర్జనముగాను పాడుగానుచేయగా నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. 

యెహెజ్కేలు7వఅధ్యాయము

1  మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 
2  నరపుత్రుడా, ప్రకటింపుము; ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభు వగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. 
3  నా కోపము నీమీద తెప్పించు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించుచున్నాను. 
4  నీయెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నేను యెహోవానై యున్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను, నీ హేయ కృత్యములు నీ మధ్యనే యుండనిత్తును. 
5  ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాదుర దృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది, 
6  అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయెను. 
7  దేశ నివాసులారా, మీమీదికి దుర్దినము వచ్చుచున్నది, సమ యము వచ్చుచున్నది, దినము సమీపమాయెను, ఉత్సాహ ధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతములమీద వినబడు చున్నది. 
8  ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీమీద కుమ్మరింతును, నీమీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీ సమస్త హేయకృత్య ముల ఫలము నీమీదికి రప్పించెదను. 
9  యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై యున్నానని నీవెరుగునట్లు నీ యెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను, నీ హేయకృత్యములు నీ మధ్యనుండనిత్తును. 
10  ఇదిగో యిదే ఆ దినము, అది వచ్చేయున్నది, ఆ దుర్దినము ఉదయించు చున్నది, ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగి రించియున్నది, బలాత్కారము పుట్టి దుష్టులను దండించున దాయెను. 
11  వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమియు శేషింపదు. 
12  కాలము వచ్చుచున్నది, దినము సమీప మాయెను, వారి సమూహమంతటిమీద ఉగ్రత నిలిచి యున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు. 
13  వారు బ్రదికి యున్నను అమ్మువాడు అమ్మినదానికి తిరిగి రాడు, ఈ దర్శ నము వారి సమూహమంతటికి చెందును, అది తప్పక జరు గును, వారందరు దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించు కొనుటకు వారిలో ఎవరును ధైర్యము చేయరు. 
14  వారు సర్వసిద్ధులై బాకా నాదము చేయుదురు గాని వారి సమూహమంతటిమీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొనువాడొకడును ఉండడు. 
15  బయట ఖడ్గమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి, బయటనున్న వారు ఖడ్గముచేత చత్తురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మింగును. 
16  వారిలో ఎవ రైనను తప్పించుకొనిన యెడల వారందరును లోయలోని గువ్వలవలె పర్వతములమీదనుండి తమ దోషములనుబట్టి మూల్గులిడుదురు. 
17  అందరిచేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్లు నీళ్లవలె తత్తరిల్లును. 
18  వారు గోనెపట్టకట్టు కొందురు, వారికి ఘోరమైన భయము తగులును, అందరు సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. 
19  తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించ జాలదు, అది వారి దోషక్రియలు విడువకుండ అభ్యంతరమాయెను గనుక దానివలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు. 
20  శృంగార మైన ఆ యాభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి, దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసెదను, 
21  వారు దాని అపవిత్రపరచునట్లు అన్యులచేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను. 
22  వారిని చూడ కుండ నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రు వులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు. 
23  దేశము రక్త ముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండి యున్నది. సంకెళ్లు సిద్ధపరచుము. 
24  బలాఢ్యుల యతి శయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధస్థలములు అపవిత్రములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించె దను; ఆ దుష్టులు వారి యిండ్లను స్వతంత్రించుకొందురు. 
25  సమూలధ్వంసము వచ్చేయున్నది, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారుగాని అది వారికి దొరకదు. 
26  నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమా చారము వెంబడి సమాచారము వచ్చుచున్నది; వారు ప్రవక్తయొద్ద దర్శనముకొరకు విచారణచేయుదురుగాని యాజకులు ధర్మశాస్త్రజ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకయే యున్నారు. 
27  రాజు వ్యాకులపడు చున్నాడు, అధికారులు భీతినొందుచున్నారు, సామాన్య జనులు వణకుచున్నారు; నేను యెహోవానై యున్నా నని వారు తెలిసికొనునట్లు వారి ప్రవర్తనఫలము నేను వారి మీదికి రప్పింపబోవుచున్నాను, వారు చేసిన దోషము లను బట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను.